Tuesday, June 30, 2009

కళకలలు

ఈ మధ్యన దవిన్చీ పెయింటింగ్ యింకోటి బయటపడ్డది... దవిన్చీని యిన్చి యిన్చీ కొల్చి ఒక్కో సెంటీమీటరుకో కోటో ఎంతో లెక్కలు కట్టారు ఆర్టు లవర్లు.

కానీ ఆ చిత్ర పరిశ్రమ (నిజంగా శ్రమేనండోయ్) వెనక ఆ కళాకారుడి వేదన, యాతన ఎంత? దాన్ని దాచుకున్న కళాప్రేమికుడి కళారాధన విలువ ఎంత? అని కొలిచే సాధనా లేవీ రోజుల్లో, ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడానూ.

విన్సెంట్ వ్యాంగో అనే చిత్రకారుడు బతికినంతకాలం దుర్భరమైన దారిద్ర్యంతో బతికాడు. వందలకొద్దీ చిత్రాలు వేశాడు. కేన్వాసులూ, రంగులూ, కుంచెలూ కొన్డానికి వేశ్యలకి చిన్న చిన్న చిత్రాలు వేసి అమ్మి డబ్బు సమకూర్చుకునేవాడు. కానీ బతికున్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి పెద్ద చిత్రాన్ని అమ్ముకోలేకపోయాడు. అతను దారిద్ర్యంతో, మతి చాంచల్యంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ రోజున అతని చిత్రం ఒక్కొక్కటి కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది. ఈ రోజున కూడా ఎక్కడో ఎమ్. ఎఫ్. హుస్సేన్ లాంటి వాళ్ళు లక్షలాది రూపాయలకు వాళ్ళ చిత్రాలను అమ్ముకొంటున్నారు.

* * *

కళాకారుల్లో చిత్రకారులూ, నర్తకులూ, గాయకులూ, శిల్పులూ వస్తారుగానీ అదేం ఖర్మో కవులూ, రచయితలూ రారు. రాజుల పోషణలో వెనకటితరం కవులు ధనవంతులుగానే బతికుంటారు (ఎక్కడో పోతన లాంటి వాళ్ళు తప్ప). ఈ తరం రచయితల్లో ఎంతమంది కవులూ రచయితలూ వాళ్ళ వాళ్ళ సాహిత్యానికి సరైన విలువ పొందగలుగుతున్నారు. (సినిమా రచయితల్నీ కవుల్నీ యిక్కడ మినహాయించాలి.) రచనలకందే పారితోషికాలంటారా? అవీ అంతంత మాత్రమే. అలాంటప్పుడు రచయితన్నవాడిక్కూడా రాయ మనస్కరించదు.

ఇక్కడో మాట చెప్పుకోవాలి. ఓ మలయాళీ రచయిత ఓ పుస్తకం అచ్చువేస్తే అయిదు వేల కాపీలు అచ్చు వేస్తాడుట. ఇక్కడ మనం వెయ్యి కాపీలు అచ్చు వేసుకుని అటకల మీద కట్టలు కట్టి ఏ ఆర్నెల్లకో దుమ్ము దులుపుకుని ఎలుకలకి నైవేద్యమైన వాటిని వేరు చేసుకుని మన జీవిత కాలం అమ్ముకుంటూనే వుంటాం.
కొన్ని పుస్తకాలీ మధ్య అమ్ముడవుతున్నాయి. అది సృజనాత్మక సాహిత్యం కాదు. వికాసాలూ, నిచ్చెన్లూ, పైకెగబాకడాలూ, ఆకాశాన్నందుకోవడాలూ... యివీ.

* * *

రచనల విషయం వచ్చింది కాబట్టి యిక్కడ ఓ ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించాలి. ఒకాయన పేరు శ్రీరాగి (కోసల్లి పూర్ణ చంద్ర సదాశివ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు). ఇంకొకాయన వియోగి (విజయప్రసాద్), పై చెప్పిన శ్రీరాగి గారి కుమారుడు. ఈయనకు బి.ఎస్సీతో పాటు అయిదు (అక్షరాలా అయిదు) ఎమ్మే డిగ్రీలున్నాయి. శ్రీరాగి గారు ప్రభుత్వాధికారిగా రిటైరయ్యారు. వియోగి ఎల్.ఐ.సి ఏజెంట్స్ కాలేజ్ ప్రిన్సిపాలుగా వున్నారు.

వీళ్ళిద్దరూ అవిశ్రాంతంగా రాస్తూనే వుంటారు. యిద్దరూ 150 పైచిలుకు కథలు రాసి వివిధ పత్రికల్లో ప్రచురించారు. శ్రీరాగి గారి ఇంగ్లీషు అనువాద కథలు ఎన్నో యిదే పత్రికలో ప్రచురితమయ్యాయి. పుస్తకాలు అచ్చువేపించి యిస్తామంటూ సాహితీ సేవకుల వేషాలు వేసుకున్న బ్రోకర్లు కొల్లలుగా వున్న దేశం కదా మన్ది. తండ్రీకొడుకులిద్దరూ ఈ బ్రోకర్ల బారిన పడి ఓ లక్ష రూపాయలు నున్నగా రాల్చుకున్నారు.

వీళ్ళిద్దరూ మహాద్భుతమైన సాహితీ సృజనకారులని అనలేను కానీ, వీళ్ళిద్దరికీ వున్న సాహితీ నిబద్ధత మాత్రం చాలా గొప్పది అన్చెప్పగలను. వీళ్ళు అసలైన కళాకారులనిపిస్తుంది.

* * *

కళాకారుడు ఏ రూపంలోనైనా వుండొచ్చు. శిల్పి, చిత్రకారుడు, గాయకుడు, నర్తకుడు, కవి, వక్త వీళ్ళందరి మీదా వీళ్ళందరికంటే అద్భుతమైన కళాకారులు మన ముందుంటారు.

మంచి శ్రోతలు. వీళ్ళు బహు తక్కువగా వుండి అరుదుగా కనిపిస్తుంటారు.

* * *

మా కర్నూలు-నంద్యాల రోడ్డు మీదికి ఒక హోటేలుంది. చిన్నదే. అందులో ఓ ఇరవై ఇరవైఅయిదు సంవత్సరాల కుర్రాడు పన్జేస్తాడు. వాడి పని కూరగాయలు తరగడం.

వాడు ఉల్లిపాయలు తరుగుతాడండీ! అసలు ఉల్లిపాయలవేపు చూడడు. వాడి వేళ్ళూ కత్తే చూస్తుంటాయి. ఆ కత్తి కూడా సగం అరిగిపోయి మాసిన పాత చిరుగుగుడ్డ చుట్టబడిన హ్యాండిల్ కలిగుంటుంది. వాడు ఉల్లిపాయలు తరిగే చెక్కముక్కను కూడా హొటేలు కష్టమర్లు ఎప్పుడో సగానికి పైగా తినేసారు. నల్లగా బక్కపల్చగా ఉండి జెట్ స్పీడ్‌‍తో ఉల్లిపాయలు తరిగే వాడి నైపుణ్యం నా మటుకు నాకు ఓ అద్భుతమైన కళే అనిపిస్తుంది సుమండీ.

* * *

జనార్థన మహర్షి తన "వెన్న ముద్దలు" పుస్తకం వెనక యిలా రాసుకున్నాడు:

"నాకు చాలాసార్లు ఓ కల వస్తుంటుంది. చాలా అందమయిన కల. అందులో కవి ఒకడు తన కవిత్వం ద్వారా సంపాదించిన డబ్బుతో కారులో తిరుగుతూంటాడు. కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటాడు. ఆ కవిత్వం పదే పదే ముద్రింపబడి ఆ కవి మనవళ్ళు రాయల్టీ రూపంలో లక్షలు పొందుతుంటారు. అతని గొప్ప కవితాపదాలు యింటింటా గాయత్రీ మంత్రమవుతుంది.

అప్పుడు కవి తన డబ్బుతో తన కవిత్వం ప్రింట్ చేసుకోనక్కర్లేదు. అప్పు చేసి, ఆస్తులమ్మి కవితా సంకలనాన్ని పుస్తకాల షాపులో దుమ్ము పట్టించుకోనక్కర్లేదు."

మహర్షీ! మీ కల నిజమవ్వాలని నేను కోరుకోవడం కూడా కలేనా?

(ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక నవంబరు 2005 సంచికలో ప్రచురితమైంది.)

1 comments:

కొత్త పాళీ said...

బ్లాగు లోకానికి స్వాగతం