Monday, June 29, 2009

వైయక్తిక యుద్ధాలు

కూలివాడి దగ్గర్నించీ కోటీశ్వరుడి వరకూ జీవితం ఓ యుద్ధం. కొందరికి మాత్రం పరోక్ష యుద్ధమే అయినా, చాలామందికి ప్రత్యక్ష యుద్ధమే.

రోజుకో యుద్ధనీతి...
రోజుకో యుద్ధరీతి...

ఉదయం నిద్ర మేల్కొన్న క్షణం నించి రణన్నినాదాలే వినబడ్తుంటాయి. శరీరంలో ప్రతి అవయవమూ యుద్ధ ఘంటారావంతో మేల్కొంటుంది. అసలు సగటు మనిషి మేలుకోవడం మేలుకోవడమే యుద్ధగీతి నాలపిస్తూ (ఆవలింతతోపాటు) మేల్కొంటాడు.

రాత్రి పక్క మీదికి చేరుకోగానే మరుసటి దిన రణతంత్రపుటాలోచన్లు మేధను కమ్ముకుంటాయి. ఉదయం లేవగానే ఎవరు ఎవరి మీద దండెత్తాలి? ఎవరు దేన్తోటి యుద్ధం చేయాలి? దేనికోసం పోరాడాలి? పోరాడితే ఎలా పోరాడాలి? పోయిన్ది మళ్ళీ ఎలా సంపాదించాలి? పక్కవాడి శాంతిని (ఉంటే) ఎలా నాశనం చేయాలి? మనకున్న అశాంతిని (ఉండేదదే కాబట్టి) ఎలా పెంచుకోవాలి? ఇలా యుద్ధతంత్రపుటాలోచన్లు...

సర్సరేనయ్యా, ఇవన్నీ సామాన్య మానవులకి, నైమిత్తికాలకోసం దేవులాడే జన బాహుళ్యానికే... ఇటువంటి నీచ నికృష్ట భౌతిక స్వార్థ యుద్ధాల కతీతమైన "మగానుభావులు" ఉన్నారు... వాళ్ళ మాటేమిటీ అంటారా?

తెల్సండీ... సాములోర్లూ సన్నాసులూ కాషాయిధారులూ గెడ్డాలోళ్ళూ వాళ్ళందర్కీ ఈ యుద్ధాలూ గట్రా ఉండవనే దురభి (సారీ) అభిప్రాయం మీకుందేమో.

వాళ్ళూ తిళ్ళు తినాలి. వాళ్ళూ మనుగడ సాగించాలి. వాళ్ళూ హాయిగా నిద్దరోవాలి. వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యాలు (మఠాలూ, పీఠాలు, ఆశ్రయాలూ వగైరా వగైరాలు) వాళ్ళు కాపాడుకోవాలి. కాదంటారా? "లేదు" అని మీరంటే మీకంటే పసిపిల్లలు ఉండరు (అంటే మీరు దేవుళ్ళతో సమానమన్మాట). వాళ్ళ వాళ్ళ యుద్ధాలు వాళ్ళకుంటాయండీ.

ఓ గుడి ప్రాంగణం పడగొట్టి కొత్తది కట్టాలంటే మా శాస్త్రం ప్రామాణికం అంటే; కాదు, కానే కాదు మా శాస్త్రం ప్రామాణికం అంటూ... ఓ సాములోరు "నిలువు" అంటే ఇంకో సాములోరు "అడ్డం" అనీ... కొండొకచో మన పురుచ్చితలైవి జయలలితాంబ వారి మీద పరోక్ష యుద్ధాలు చేసేసి ప్రత్యక్ష నరకాలైన జైలుకు వెళ్ళడాలూ... ఇట్లా వాళ్ళు కూడా ఉదయం లేవగానే యుద్ధానికి సన్నద్ధం కావాల్సిందేనండీ.

ఇక ఇవి కాక, ఆముష్మిక యుద్ధాలు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ఆత్మానుగత యుద్ధాలు, నిర్వికల్ప నిరామయ సమాధి స్థితి కోసం చేసే యుద్ధాలు....

సకల జీవరాసులకీ, అచర జగత్తుక్కూడానండీ (వీటికి మనిషితో యుద్ధం) యుద్ధం అనివార్యం.

Struggle for Existence అనీ
Survival of the Fittest అనీ ఇంగిలీషులో, యుద్ధం అనివార్యం.

"యుద్ధరాహిత్యమన్నది అస్సలుండదా" అనడుగుతారా.... ఉంటుందండీ... అయితే యాక్షన్ సీన్లు ఉండవు. ఛేజింగులుండవు. బాంబులూ, కత్తులూ, కరాటేలు వుండవు. "నో డిషుం డిషుం..."

అంటే నీ బతుకు నువ్వు బతికి నా బతుకు నన్ను బతికి ఛావనీ అన్న రిటైర్మంటన్నమాట. దాన్నే ఇంగిలీషులో symbiosis అంటారు. (ఇంగ్లిష్లో ఏడిస్తే దానికో సాధికారత ఏడిచి చస్తుందిగా, అందుకని ఇంగిలీషు మాట అన్మాట.)

మన మన చిన్న లోకాల పరిధుల్లోని వ్యక్తుల్నీ వాళ్ళు చేసే యుద్ధాల్నే పరిశీలించండి బాగా దగ్గర్నుంచీ... వాళ్ళ జీవిత యుద్ధాల్నించీ మనం చాలా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. (అది నువ్వు కొత్తగా చెప్పేదేముందివాయ్, అంటారా? ఓ మంచి పాఠాన్ని ఎవరైనా ఎన్నిసార్లయినా చదవొచ్చూ చెప్పొచ్చూ కదండీ.)

* * *

"ఎవరో వస్తారని ఏమో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా"

అని ఓ సినీ కవి హెచ్చరించి, ఒరేయ్ మామూలు మనిషీ! ఈ యుద్ధం నీది, నీ యుద్ధం నువ్వే చేయాలి. లే పోరాడు, పోరాటం లేకపోతే బతుకుబండి సాగదు అన్చెప్పాడు.

అదే విషయం మన గీత కూడా చెప్పింది.

ఏ గీతా? మీ పక్కింటమ్మాయి పొడవాటి చెవి లోలాకులూ, పొట్టి జుత్తూ, ప్యాంటూ షర్టూ వేసుకుని ఎమ్మే ఇంగిలీషు చదివి ఎలిమెంటరీ స్కూల్లో తెలుగు పాఠాలు చెబుతుందే ఆ పిల్లా? అనడక్కండి. ఆ గీత కాదు. భగవద్గీతండీ (అబ్బో వీడు మళ్ళీ యింకో సంస్కృత శ్లోకంతో కొట్టి మన్నేడిపించేస్తాడ్రా బాబో అనుకుంటున్నారా? కరెక్టే ఏడవండి).

ఆత్మ సంయమ యోగంలో ఈ శ్లోకం చూడండి:

"ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యోత్మనో బన్ధురాత్మైవ రిఫరాత్మవః"

అంటే, "నాయనా! నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు అధోగతి పాల్చేసుకోకూ, నీకు నీవే బంధువ్వి, నీకు నీవే శత్రువు కూడానూ తెలిసిందా" అని. అంటే శాస్త్రాలూ, దేముళ్ళూ, సాములోళ్ళూ, గురూ గార్లూ ఎందరున్నా... చూపుడు వేల్తో అదో అదే నీ దారి అన్చూపుతారే తప్ప నిన్ను మోసుకెళ్ళరు. ఆ దారెంబడ నడిచి ఛావాల్సింది నువ్వే అని కదా! సో... అందువలన... ఇస్లియే... కాబట్టి మన మన జీవిత యుద్ధాలు మనమే చేసుకొనవలెను.

* * *

సమష్టి యుద్ధాలుండవా అనడగొచ్చు మీరు. ఉంటాయి, ఉండితీరతాయి. అవే చరిత్రలు... అవే నాగరికతల మలుపులు. వాటి గురించి చిన్న వ్యాసాలు చాలవు. పెద్ద దొడ్డు పుస్తకాలు రాయాలి. కాబట్టి వైయక్తిక యుద్ధాలకే ఈ చిన్న వ్యాసం పరిమితం.

* * *

ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి. వయస్సు సరిగ్గా ఇరవైరెండేళ్ళు. సన్నగా, పీలగా, నల్లగా గుంటలు పడ్డ కళ్ళతో చూట్టానికి పదిహేను పదారేళ్ళ అమ్మాయిలా ఉంటుంది. ఆ అమ్మాయి తల్లి రాములమ్మ. టైలరు. మా అక్కయ్యా వాళ్ళ రవికెలూ అవీ కుడుతూంటుంది. ఓ నాలుగైదు కుట్టుమిషన్లు పెట్టుకుని టైలరింగు నేర్పుతుంటుంది. (రాములమ్మ యుద్ధం గురించి రాయట్లేదు నేను. ఆమె కూతురు రాజేశ్వరి యుద్ధం గురించి కదా.) రాజేశ్వరికి పదో తరగతి అవంగానే పదహారో ఏట పెళ్ళి చేశారు తల్లీదండ్రీ. (వాళ్ళ అవిద్య, అజ్ఞానం, మౌడ్యం అవి అప్రస్తుతాలు). రాజేశ్వరి పదిహేడో ఏట తల్లైంది.... మగబిడ్డ... పండులాగానో పువ్వులాగానో చిదిమి దీపం పెట్టుకునేట్టుగానో లేడు... ఎదిగీ ఎదగని ఆ పిల్ల శరీరాన్ని చీల్చుకు పుట్టినవాడు... వాడు. ఏ విధమైన ఎదుగుదలా లేకుండా ఈ భూమ్మీద పడ్డాడు.

రాజేశ్వరి భర్త దగ్గర్నుంచీ అత్తమామలూ ఆడపడుచులూ చుట్టు పక్కలవాళ్ళూ అందరూ వాణ్ణి అసహ్యించుకోడం... ఏవగింపుగా చూడ్డం... ఓ సంవత్సరం ఆరునెల్లు గడిచాయి... పిల్లవాడికి మెడ నిలవదు... చూపు నిలవదు... అనాకారి... మెట్టినింటి వారి అసహ్యం వాడివేపు ఎంతకు పెరిగిందంటే... వింటే వళ్ళు జలదరిస్తుంది, కంపరమెత్తుతుంది. మనిషి ఏమైపోయాడని అనిపిస్తుంది.

ఇలాంటి పిల్లాడు పిల్లాడేనా... వదిలించుకుందాం... కాలువలో పారేద్దాం... కంప చెట్లలో విసిరేద్దాం... గొంతులో కింత ఏమైనా వేసేద్దాం... అనడం నించీ... ఓ కాళరాత్రి ఆ ప్రయత్నం చేయడం వరకూ వచ్చింది. అది రాజేశ్వరి కళ్ళపడింది. కేకలేసింది. గోల చేసింది. ఆ పసికందు నెత్తుకొని గుండెలక్కరుచుకుని ఆ నడిరాత్రి పరిగెత్తి పరిగెత్తి బస్టాండు చేరుకుని బస్సెక్కి తల్లి దగ్గరికొచ్చేసింది. తల్లీ అన్నయ్యా ఆదరించి ఓదార్చారు. కడుపులో దాచుకున్నారు.

ఓటు హక్కు కూడా లేని రాజేశ్వరి అనే ఆ పసితల్లి, తన మాతృత్వపు హక్కు కోసం యుద్ధం మొదలుపెట్టింది. భర్తను కాదు పొమ్మంది. తల్లినించి నేర్చుకున్న కుట్టుపనిని నమ్ముకుంది. జీవితమ్మీదా, తన మీద తిరగబడ్డ ప్రకృతి మీదా, భర్త మీదా, తన కడుపున పుట్టిన వాడి వైకల్యమ్మీదా యుద్ధాన్ని ప్రకటించింది. అది అవిశ్రాంత యుద్ధమని ఆ పిల్లకు తెలుసు.

ఈ వ్యాసం రాస్తూన్న సమయానికి కుట్టిన రవికెలు తీసుకుని ఇంటికి వచ్చింది. కొడుక్కి ఏడేళ్ళు వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఒక్కో అడుగూ వేస్తున్నాడు. మెడా, చూపూ నిలబెడుతున్నాడు. మనుషుల్ని, ముఖ్యంగా వాళ్ళమ్మని గుర్తుపడుతున్నాడు. ఈ విషయాల్ని ఆనందంగా చెప్పిందా అమ్మాయి.

బాబుకేం పేరు పెట్టావు తల్లీ అనడిగితే "శశాంక్" అని గర్వంగా చెప్పింది. నిజమే కదా! ఆద్యంతాలు లేని అమ్మ మనస్సాకాశంలో ఏ బిడ్డైనా చంద్రుడే కదా! బక్కపల్చగా కనబడే రాజేశ్వరిని చూస్తుంటే, ఆమె చేస్తున్న యుద్ధం చూస్తుంటే, ఎంతటి యోధ ఈ పిల్ల! అనిపించింది.

* * *

"జీవితం బుద్బుద ప్రాయమే అయినా
రెండు విషయాలు మాత్రం పాషాణ సదృశాలు
ఒకటి - ఒకరి నిర్వేదంలో దుఃఖంలో నువ్వు చూపే దయార్ద్రత
రెండు -నీ స్వంత కష్టాల్లో నువ్వు ప్రదర్శించే ధైర్యసాహసాలు"

-- ఆడమ్ లిండ్సే గార్డన్

మనల్ని మనం జయించుకున్న తర్వాత
యుద్ధభీతి ఖచ్చితంగా నశించిపోతుంది.

-- కాశీభట్ల వేణుగోపాల్

(ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక అక్టోబరు 2005 సంచికలో ప్రచురితమైంది.)

1 comments:

అయితగాని జనార్ధన్ said...

రాజేశ్వరి కథ ఒక్క రాజేశ్వరిదే కాదు. ఈ సమాజంలో ఎదిరించ లేని రాజేశ్వరులు గల్లి గల్లికీ ఉన్నారు. ఐతే రాజేశ్వరి తిరగబడింది. ధైర్యాన్ని నమ్ముకుంది. తన మాతృప్రేమను జయించింది. కానీ మిగతా మాతృమూర్తులు తమ శరీరంలో బాగమైన జీవకణాలను నిప్పుకణాలకు వదిలేస్తున్నారు. కవోష్ణధారలను కన్నుల వెంట కారుస్తూ తమ అశక్తతకు తామే కారణమని తిట్టుకుంటూ బతుకుతున్నారు. పట్టణాల్లో, నగరాల్లో నర్సింగ్్హోంల నుంచి తెచ్చి వదిలేసిన పిండాలు ఊరిచివర చెరువులో అనాథ శవాలై తేలుతున్న శశాంక్్లు ఎందరో వారి కలలు కళలు ఒక్క క్షణమే. మంచి వ్యాసం అందించినందుకు థాంక్స్్జనార్ధన్్ ఫీచర్్ సచ్్ఎడిటర్్ ఎబియన్్ ఆంధ్రజ్యోతి న్యూస్్ చానల్్ mail: janardhan_akshara@yahoo.co.in