Sunday, June 28, 2009

బహు భయంకర మే"తా"వులు

బొద్ధారో మత్సర గ్రస్తాః ప్రభవః స్మయ దూషితాః
అబోధోసహతాశ్చాన్యే జీర్ణ మంగే సుభాషితః

-- అంటాడు భర్తృహరి.

ఏదేనా రాయమని ఈ పత్రిక వారు అడిగారు.... నిజమే ఏమైనా చెప్పాలని ఉంటే నాలాంటి రచయితలకు అక్షరం సరైన మాధ్యమం... బాగానే వుంది కానీ ఏమిటి చెప్పడం?

పై శ్లోకంలో చెప్పినట్టు తెలిసిన వారూ, ప్రభువులూ వినే స్థితిలో లేరు. సామాన్యులకా వినే తెలివి లేదు (అవసరం అస్సలు లేదు). అందుకే చెప్పాలీ అనిపించిందేదైనా ఉంటే గింటే, లోపలికి దిగమింగుకోవడం అలవాటైపోయింది. అదుగో సరిగ్గా అట్లా ఉన్నప్పుడు ఈ పత్రికవారు ఫోను చేసి పర్వాలేదు ఏదో రాయండి, అదీ నెలకో మాటే గదా పాఠకులు భరిస్తార్లెండి అన్నారు.... ఆనందం!

ఆనందం అని అనేశాను గానండీ... భయం దాన్ని మింగేస్తూంది. భయం దేనికంటారా? నా అజ్ఞానానికీ, నా లోపల కురచదనానికీ, నా అసమర్థతకీ నేనే భయపడే రోజులు పోయాయి (తెలుగు రచయితను గదా!). ఇప్పుడు నా భయమల్లా "విమర్శకులు" అన్న వేషం వేసుకున్న మే"తా"వుల గురించి, వల్లానూ.

ముఖ్యంగా మన తెలుగు సాహితీ విమర్శకుడు బహు భయంకరుడు (కొందరు ఇందుకు మినహాయింపు; కొందరంటే బహు కొందరని).

వీళ్ళు పైన భర్తృహరి చెప్పిన మూడు వర్గాల్లో ఏ కోవకీ చెందరు. వీళ్ళది ఓ ప్రత్యేక జాతి.
ప్రభువులా?... కాదు.

బాగా తెలిసినవారా?... కానే కాదు.

అసలు తెలీనివాళ్ళా?... వుహూఁ

వీళ్ళు సందర్భానుసారం సంకలన కర్తలుగానూ, సంపాద(త)కులుగానూ కవులుగానూ, కథకులుగానూ, మీ"టింగు"ల్లో (అధిక) ప్రసంగికులుగానూ ఒకటేమిటీ రచనా ప్రక్రియ అన్నదానికి సంబంధించిన అన్ని విషయాల్లో, అన్ని రకాల కార్యక్రమాల్లో రకరకాలుగా వేషాలు మార్చగల కళాభినివేశంవున్నవాళ్ళు.

వీళ్ళ గురించండీ నా భయమంతానూ.

వీళ్ళు తమని తాము watch dogs అన్చెప్పుకుంటూ సాహిత్యాన్ని కాపలా కాస్తున్నాం అంటూంటారు.

వీళ్ళు వీర భయంకర భాషాభిమానులుగా కాననయ్యెదరు. ఎందుకో తెలుసాండీ? వీళ్ళకి తెలిసింది ఒక భాషే గనుక. (ఆంధ్ర భాషా! ఆనందించుము.) వీళ్ళు పరభాషా సాహిత్యం కూడా చదువుతారు... ఎట్లా? దాన్నెవరన్నా తెలుగు చేస్తే (అసలు తెలుగు చేయబడ్డ పరభాషా సాహిత్యం ఎంత ఉందో అందరికీ తెలుసు).

వీళ్ళకి "కాఫ్కా", "నబొకొవ్"లు తెలియరు (వీళ్ళని తెలుగు చేయగల దిట్టలు ఇంకా రాలేదు). ఒకవేళ వాళ్ళ పేర్లు తెలిసినా చాలు వాళ్ళ సాహిత్యం మొత్తాన్నీ బేరీజు వేయగల్రు. ఎలాగంటే వీళ్ళు అలాంటి తుంటరి రచయితల గురించిన వ్యాసాలు (తెలుగులో) చదివుంటారు. అవి చదివేసి వారి వారి సాహిత్యాన్ని తక్కట్లో పారేసి తూకం వేసి పారేసి దాని "రేటు" ఎంతో ఏమిటో చెప్పేయగల్రు, చెప్పేస్తారు.

ఇక్కడ ఓ విషయం ప్రస్తావిస్తాను. వివాదాస్పదుడిగా పేరుబడ్డ రచయిత "రష్దీ". అతని పుస్తకం "సటానిక్ వర్సెస్" మన దేశంలో ప్రత్యక్షమయిన వెంటనే ఆ పుస్తకాన్ని ఇస్లామిక్ దేశాలు నిషేదించాయి. ఇస్లాం వ్యతిరేకంగా చెప్పబడ్తూ రష్దీ మీద మరణదండన "ఫత్వా" జారీ చేయబడ్డది. వెనువెంటనే, మన్ది మరీ సెక్యులర్ దేశం కదా (అందునా అప్పటికే రష్దీ పుస్తకం "మిడ్‌‍నైట్స్ చిల్డ్రన్" ఇందిరాగాంధీ కినుకకు కారణమయి ఉండింది కూడానూ), మన్దేశంలో కూడానూ "సటానిక్ వర్సెస్" నిషేదానికి గురైంది. ఇంకేం ఆ పుస్తకాలు నల్లబజార్లో విపరీతమయిన ధరకు అమ్ముడయ్యాయి. అది ఫక్తు వ్యాపార సంబంధ విషయం. మన సాహిత్య గొడవలుగానీ, మత ప్రసక్తి గానీ నల్లబజారుకు అడ్డు రాలేదు.

ఆ సందర్భంలో ఒక ముస్లిం రాజకీయ నాయకుడు ఆ పుస్తకాన్ని తీవ్రంగా తెగనాడారు. అప్పుడాయనకూ ఓ పత్రికా ప్రతినిధికీ మధ్య జరిగిన సంభాషణ యిలా వుంది.

పత్రిక: "అయ్యా! సటానిక్ వర్సెస్ పుస్తకాన్ని ఎందుకని నిషేదించాలనుకుంటున్నారు?"

రా.నా.: "అది ఇస్లాం వ్యతిరేక భావాలు కలిగివుంది. దాన్నిండా blasphemy (దైవ దూషణ) ఉన్నది."

పత్రిక: "మీకెట్లా తెలుసా సంగతి? మీరు ఆ పుస్తకాన్ని చదివారా?"

రా.నా.: "భలేవారే! నేను ఇస్లాం విశ్వాసిని. దాన్ని వ్యతిరేకించే భావాలు గల పుస్తకాన్ని ఎలా చదువుతాను? మీరైనా నన్నెలా చదవమంటారు?"

పత్రిక: ???

పై సంభాషణలోని రాజకీయ నాయకుడికీ మన విమర్శక శిఖామణులకీ పెద్ద వ్యత్యాసం లేదు. వీళ్ళు చదవకుండా ఏ పుస్తకం పైనైనా ఎడా పెడా వాయించేయగల్రు. ఈ మహానుభావుల మేధ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికో చిన్న ఉదాహరణ. ఓ మీటింగులో సదరు విమర్శకాగ్రేసర్ భుక్తాయాసం తీర్చుకుంటున్నారు. (వారేం తిన్నారో చెప్పనవసరం లేదు గదా!) నా మిత్రుడొకడు పరమకంత్రి. ఓ ప్రముఖ దినపత్రికలోని ఓ వార్తని ముక్కల కింద విడగొట్టి ఓ రెండు ఠావులు నిలువునా నింపి పట్టుకెళ్ళి ఆ మహాశయులకు చూపించాడు. దాన్ని నిశితంగా (?) పరిశీలించిన ఆ గొప్ప మేధావి "ఆహాఁ చాలా మంచి కవిత వ్రాసారండీ. ఫలానా పత్రిక ఆదివారం అనుబంధానికి ఫోన్చేసి చెప్తాను" అని సెలవిచ్చారు.

ఆ ఫలానా పత్రికలోదే ఆ వార్త.

అదండీ సంగతి! ఇలాంటి వాళ్ళకి భయపడకుండా నాలాంటి అల్పజీవి ఎలా ఉండగలడండీ. అందుకే రాయమని అనగానే ఆనందం పలచబడ్డది.

* * *

చదవడం రానివాడు ఎంత అల్పజీవో, చదవడం తెలిసీ చదవనివాడు అంతకు ఎన్నో రెట్లు అల్పుడు.

[ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక సెప్టెంబరు 2005 సంచికలో ప్రచురితమైంది. ]

3 comments:

Vamsi M Maganti said...

"పాపాల అభ్యంగనస్నానానికి
కనికారపు కన్నీళ్ళు కార్చలేను"

అని ఎవరో వ్రాసిన మాటలు గుర్తుకువచ్చాయి... :)

మిగతాది అంతా బానే ఉన్నా....మీ చివరి వాక్యంలో ఒక భాగంతో ఏకీభవించలేకున్నాను.... చదవడం రాని వాడిని అల్పజీవి అనటం, అది ఏ దృష్టితో అయినా - నా దృష్టిలో అల్పాతి అల్పం...ఇతరుల దృష్టిలో తప్పై ఉండవచ్చు, కానీ నేను అనుకునేది, నమ్మేది అది.....చదువురాని వాడు, చదువులేని వాడు, చదువుకోలేని వాడు - మనుష్య జాతికే మహారాజులు......ఈ మీ అల్పజీవులు - "ఆలపించని గాంధర్వ సాగరాన్ని తన మూగ శంఖంలో దాచుకున్న మహోన్నతులు" :) ..

రెండో భాగంతో మటుకు కొద్దిగా ఏకీభవిస్తాను - చదువుకున్న వాడు, అలా చదివిన చదువుతో పాటు నాగరికత నేర్చుకున్నామనుకున్నవాడు చాలా ప్రమాదకరమయిన మనిషి.......

ఇందులో ఎగతాళి ఏమీ లేదని....నాకు అనిపించింది మాత్రం చెప్పాననిన్నీ....మీరు నన్ను ఏ విభాగంలో జమ చేసినా చింత ఏమీ లేదనీ.....:) ....ఇంతే సంగతులు చిత్తగించవలెను...

kasturimuralikrishna said...

కాశీభట్ల వేణు గోపాల్ గారూ,

బ్లాగ్లోకానికి సాదర పూర్వక ఆహ్వానం. బ్లాగు ప్రపంచంలోనయినా తరచు కలుసుకుని చర్చించుకుందాం.

Praveen's talks said...

ఈ లింక్ కూడా వీక్షించండి: http://viplavatarangam.net/2009/04/25/6