మరో మాట అవధరించండి...
ఒక ప్రముఖ కవి నన్ను కలవడానికి కర్నూలు వచ్చాడు. ఇంటికి సాదరంగానే ఆహ్వానించాను. అతనికి నేను రాసిన పుస్తకాల్లో ఒకే పుస్తకం తెలుసు. అది కూడా ఏదో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చిన పుస్తకం కాబట్టి.
వచ్చి సోఫాలో కూచునీ కూచోగానే అతని మొదటి ప్రశ్న... "మీరింకేం రాసారండీ?"
ఓపిగ్గా సమాధానమిచ్చాను.
"అహాఁ అలాగా చాలా పుస్తకాలే వున్నాయ్. నాకివ్వగలరా?"
మళ్ళీ ఓపిక తెచ్చుకుని ప్రతి పుస్తకం సంతకం చేసి మరీ యిచ్చాను.
కాస్సేపు సాహితీలోకం గురించి చర్చించుకున్న తర్వాత, అతని ప్రశ్న వెంటనే...
"మీరేం చేస్తుంటారు సారూ?"
నేనిబ్బందిగా కదిలి, "ఏమిటి ఏమి చేయడం మాస్టారూ?" అనడిగా.
"అదేమిటలా అడుగుతారు. మీరేం ఉజ్జోగం చేస్తున్నారు?" చీకాగ్గా అడిగాడతను.
నేను మరింత యిబ్బందిగా కదిలి, "ఏమీ ఉద్యోగం చెయ్యనండీ" అన్నాను.
అతను ఆశ్చర్యంగా, "మరెలా?" అనడిగాడు.
"ఎలా ఏమిటి ఎలా?" అన్నాను.
"అది కాదు మాస్టారు; మరి జరగడం ఎలా," అన్నాడు.
"భుక్తికీ గుడ్డకీ యిబ్బంది లేదు. మా అక్కయ్య ఆస్తి రాసిస్తూ ఇరవై లక్షలు ఇల్లిచ్చింది," అన్నాను.
అతను మౌనంగా వుండి పోయాడు. అతని ముఖంలో ఏదో అసంతృప్తి. అతని ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదన్న విషయం ఆయన ముఖంలో దిగంబరంగా కనబడ్డది. అతనికి నా వ్యక్తిగత విషయాల్తో పని లేదన్న సంగతి అతనికీ తెలుసు. నేను రోజూ ఉదయం అతనింటికి భోజనానికి వెళ్ళననీ తెలుసు. అయినా సరే, నా వ్యక్తిగత విషయాలు అతనికి తెలియాలి.
మామూలు మనుషుల పరిస్థితే యిలా వుంటే యిక ప్రముఖులైతే...! ప్రముఖ కళాకారులు, ప్రముఖ రచయితల వ్యక్తిగత జీవితం పట్ల కుతూహలం మరీ ఎక్కువ వుంటుంది. శ్రీశ్రీ తన "అనంతం" ప్రచురిస్తున్నప్పుడు (ధారావాహికగా) ఎంతమంది ఆ రోజుల్లో ఎంత ఆసక్తితో చదివారో చాలామందికి తెలుసు. ఆసక్తితో చదవడం వదిలెయ్యండి. అసలు శ్రీశ్రీ తన వ్యక్తిగత జీవితాన్ని పారదర్శకం చేసాడా అని ప్రశ్నించిన ప్రముఖులు చాలామందున్నారు. అసలు శ్రీశ్రీకే కుతూహలం ఎక్కువన్న సంగతి "అనంతం"లోనే వుంది. అందులో యితర ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్ని ఎంతగా శోధించాడో మనకు తెలుసు.
అసలు శ్రీశ్రీకి వ్యక్తుల వ్యక్తిగత జీవితాల పట్లే కాదు ఆసక్తి; దేశచరిత్రల చీకటి కోణాల పట్లే అనంతమైన ఆసక్తి అన్న విషయం మహాప్రస్థానం చదివితే తెలుస్తుంది.
"ఆ రాణీ ప్రేమ పురాణం
ఆ ముట్టడికైన ఖర్చులూ
కైఫియతుల మతలబులూ
కావేవీ చరిత్ర కర్థం
ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి
కనిపించని కథలన్నీ కావాలిప్పుడు"
-- అని బహిరంగంగా అరిచాడు.
* * *
ఈ నెల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక చదవడానికి కొన్నాను. ముఖచిత్ర కథనాన్ని చూడగానే ఆసక్తిగా పేజీలు తిప్పాను. ఓ ప్రముఖ (ప్రముఖ అనడం తప్పేమో... అంతర్జాతీయ ఖ్యాతి పొందిన) సంగీతకారుడి వైవాహిక జీవితం గురించి, అతని కూతురు అతని కూతురేనా? అన్నది ఆ కథనం. ఆ కథనం చదివింతర్వాత బాధ కలిగింది. కారణం ఆ సంగీతకారుడికీ అతని కూతురికీ ఎక్కడా ఎలాంటి అవమానం జరగలేదు. ఎంతోకాలంగా తన కూతురు అనుకున్న ఆ అమ్మాయి తన కూతురు కాదని తన భార్యకూ ఆ సంగీతకారుడికీ అక్రమంగా జన్మించినదనీ తెల్సిం తర్వాత... అన్నాళ్ళూ ఆ సదరు అమ్మాయి తండ్రిగా చలామణి అయిన వ్యక్తికి ఎంత ఖేదం కలిగి వుంటుందో అని తెల్సింతర్వాత బాధ కలిగింది.
* * *
ఈ విశాల ప్రపంచంలో మనకు ఉపయోగపడేవి, మన సాటి మనుషులకుపయోగపడేవి అయిన విషయాలు కోకొల్లలుగా వున్నాయి. జ్ఞానం అపారమైంది. అనంతమైంది. మనం అనవసర విషయాలను వదిలేసి... ఉపయోగపడే విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటే బావుంటుందేమో...
నిజానికి మనకు సన్నిహితులైన వారి పట్ల కూడా మనం ఈ అనవసర వ్యక్తిగత విషయాసక్తిని వదిలేయాలి. ఈ ప్రపంచం జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఎప్పుడూ సిద్ధంగానే వుంది, వుంటుంది.
(ఈ వ్యాసం "ఇంద్ర ధనుస్సు" శీర్షికన "విపుల" పత్రిక డిసెంబరు 2005 సంచికలో ప్రచురితమైంది.)